బీఆర్ఎస్‌లో మరో పార్టీ విలీనం

బీఆర్ఎస్‌ పార్టీ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. జాతీయ పార్టీగా మారినప్పటి నుంచి ఇతర రాష్ట్రాల్లో విస్తరించే క్రమంలో.. ప్రత్యేకంగా మహారాష్ట్రపై పోకస్ పెట్టారు గులాబీ బాస్. ఈ క్రమంలోనే కీలక నేతలు కూడా బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం నేతల చేరికలే కాకుండా.. ఇప్పుడు పార్టీలు కూడా విలీనం అవుతున్నాయి. దానికి కారణం కేసీఆర్ క్రేజే అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. జాతీయ పార్టీగా మారినప్పటి నుంచి బీఆర్ఎస్‌ను మిగతా రాష్ట్రాల్లో విస్తరించే దిశగా గులాబీ బాస్ కేసీఆర్ అడుగులు చకచకా వేస్తున్నారు. ఈ క్రమంలోనే పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ విస్తరణపై గట్టిగా దృష్టి పెట్టారు కేసీఆర్. అందుకు తగ్గట్టుగానే.. బహిరంగ సభలు నిర్వహించటం.. కీలక నేతలను చేర్చుకోవటంతో మరాఠా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో కేసీఆర్ దాదాపు సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆ రేంజ్‌లో చేరికలుంటున్నాయి మరి. కేవలం చేరికలే కాదండోయ్.. పార్టీలు కూడా విలీనం అవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని క్రాంతికారీ శేత్కరీ పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించగా.. ఇప్పుడు మరో పార్టీని కూడా కలిపేశారు. మహారాష్ట్రకు చెందిన స్వరాజ్య మహిళ సంఘటన్‌ పార్టీ బీఆర్ఎస్‌లో విలీనమైంది. గులాబీ బాస్ కేసీఆర్ సమక్షంలో స్వరాజ్య మహిళ సంఘటన్ అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే, సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణలోని మహిళా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయని.. ఇలాంటి విధానాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని స్వరాజ్య మహిళ సంఘటన్ అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే కోరారు. వీళ్లతో పాటు మహారాష్ట్ర బీజేపీ నాయకులు భయ్యా సాహెల్ పాటిల్, అర్జున్ వాంఖడే కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక వీళ్లే కాకుండా.. ఎన్సీపీ కార్పొరేటర్ జయంత్ చౌదరి, శివసేన నాయకుడు దత్తరాజ్ దేశ్ ముఖ్ తదితరులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 14న గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌ను క్రాంతికారీ శేత్కరీ పార్టీ అధ్యక్షుడు సతీశ్‌ పాల్వే కలిశారు. కాగా.. వారిని కేసీఆర్‌ బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పార్టీని ఏర్పాటు చేసినట్టు పాల్వే వివరించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రధాన లక్ష్యాలుగా కృషి చేస్తున్న బీఆర్ఎస్‌లో తమ పార్టీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.