రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు

  • రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన గొల్ల బాబురావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి
  • పోటీగా ఇతరులు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆర్‌వో ప్రకటన
  • సీఎం జగన్‌ని కలిసి ధన్యవాదాలు తెలిపిన నూతన ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీలేదని, వైసీపీ అభ్యర్థులవి మినహా ఇతరుల నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి(ఆర్‌వో), రాష్ట్ర శాసనసభ జాయింట్ సెక్రటరీ మంగళవారం ప్రకటించారు. ముగ్గురు అభ్యర్థులు గొల్ల బాబురావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. ఈ ముగ్గురు అభ్యర్థులకు పోటీ లేకపోవడంతో ఈ ప్రకటన చేశారు.

కాగా కే రవీంద్రకుమార్(టీడీపీ), సీఎం రమేష్ (బీజేపీ), వీ.ప్రభాకర్ రెడ్డి (వైఎస్సార్‌సీపీ) పదవీకాలం ముగియనుంది. ఈ స్థానాల భర్తీ కోసం ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏకగ్రీవం అవ్వడంతో ఇక ఎన్నిక ఉండదు.

కాగా వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చిన్నాన్న అవుతారు. ఇక సుబ్బారెడ్డి 2014లో ఒంగోలు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా ఆయన వ్యవహరించారు. రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎంపికైన మరో అభ్యర్థి గొల్ల బాబురావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే సీటు నుంచి 2009లోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ టికెట్‌పై విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏకగ్రీవమైన మరో అభ్యర్థి రఘునాథ రెడ్డి అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నారు. కాగా నూతనంగా ఎన్నికైన ఈ ముగ్గురు ఎంపీలు సీఎం జగన్‌ని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.