బిడ్డ బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం…

  • తాను రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మల్కాజ్‌గిరి ప్రజలు ఎంపీగా గెలిపించారన్న రేవంత్ రెడ్డి
  • కేసీఆర్‌తో కొట్లాడే శక్తిని ఇచ్చింది మల్కాజ్‌గిరి ప్రజలే అన్న ముఖ్యమంత్రి
  • ఈటల రాజేందర్ ఎప్పుడైనా కేటీఆర్ అవినీతి, ఫోన్ ట్యాపింగ్‌పై మాట్లాడారా? అని ప్రశ్న
  • బీఆర్ఎస్ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు మూసీలో వేసినట్లేనని వ్యాఖ్య

తన బిడ్డ (కవిత) బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని అందులో భాగంగా ఐదు స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సహకరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్‌కు ఓటు వేసి వృథా చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. మల్కాజ్‌గిరి జనజాతర సభలో సీఎం మాట్లాడుతూ మల్కాజ్‌గిరి నియోజకవర్గం తనకు కష్టాల్లో అండగా నిలబడిందన్నారు. అందుకే తాను ఎప్పుడూ మరిచిపోనన్నారు. తాను కొడంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే మల్కాజ్‌గిరి ప్రజలు ఎంపీగా గెలిపించారని గుర్తు చేసుకున్నారు. తాను ఇక్కడి ఎంపీగా చేసిన పోరాటం వల్లే పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందని ఆ తర్వాత సీఎం పదవి వచ్చిందన్నారు. రాజకీయాల్లో తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఉన్నతస్థానంలో నిలబెట్టారన్నారు.

తాను కేసీఆర్‌తో కొట్లాడే శక్తిని మల్కాజ్‌గిరి ప్రజలు ఇచ్చారని పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి అభివృద్ధి కోసం తాను పోరాడానని కానీ గత ప్రభుత్వం తనను పదేపదే అడ్డుకుందని ఆరోపించారు. అభివృద్ధి పనులు ఆగడానికి అప్పటి పాలకులే కారణమని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్నానని ఇక్కడి నుంచి సునీతా మహేందర్ రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.

హుజూరాబాద్ ప్రజలు ఎందుకు ఓడించారో ఈటల రాజేందర్ చెప్పాలని ప్రశ్నించారు. తనకు అమిత్ షా దగ్గర అని ఈటల అంటుంటారని కానీ బీజేపీలోకి వెళ్లి మూడేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశాడో చెప్పాలన్నారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారా? ఫోన్ ట్యాపింగ్‌పై గట్టిగా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ అవినీతి గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అని నిలదీశారు. కేసీఆర్ చెడ్డోడంట కేటీఆర్ మంచోడంట ఈటల ఇలాంటి మాటలు చెబుతుంటారు. కానీ దున్నపోతు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అయ్యా వంకరే కొడుకూ వంకరే అన్నారు.

అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ చెప్పారని అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతోందని… ఇప్పటి వరకు 20 కోట్ల ఉద్యోగాలు రావాల్సి ఉందన్నారు. కానీ తాను పార్లమెంట్‌లో ఉద్యోగాలపై ప్రశ్నిస్తే 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారని వెల్లడించారు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు? బీజేపీకి, ఈటలకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలన్నారు. మోదీ హామీలపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. హామీలు నెరవేర్చని బీజేపీకి… ఈటలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు.

బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి

బీఆర్ఎస్ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు మూసీలో వేసినట్లేనని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌లో ఉన్న వారికి ఒక్కటే చెబుతున్నానని మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందని పేర్కొన్నారు. కష్టనష్టాల్లో తనకు అండగా నిలిచిన మల్కాజ్‌గిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.