బిడ్డను నిద్రపుచ్చి ఓవెన్ లో పడుకోబెట్టిన తల్లి.. అమెరికాలో పసికందు మృతి

  • ఊయలకు బదులు పొరపాటున ఓవెన్ లో పెట్టానన్న తల్లి
  • కేసు నమోదు చేసి అరెస్టు చేసిన కాన్సాస్ సిటీ పోలీసులు
  • నేరం రుజువైతే 10 నుంచి 30 ఏళ్ల జైలుశిక్ష విధించే అవకాశం

అమెరికాలోని మిస్సోరి సిటీలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల పసికందును ఓవెన్ లో పెట్టిందో కన్నతల్లి.. ఆ వేడికి శరీరం బొబ్బలెక్కి అక్కడికక్కడే చనిపోయిందా బిడ్డ.. ఊయలకు బదులు పొరపాటున ఓవెన్ లో పడుకోబెట్టానని నిందితురాలు తెలిపింది. అయితే, ఆమె మానసిక స్థితిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలిని అరెస్టు చేశారు. నిర్లక్ష్యంతో పసికందు మరణానికి కారణమైందని, నేరం రుజువైతే నిందితురాలికి పదేళ్ల నుంచి 30 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.

కాన్సాస్ సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిస్సోరికి చెందిన కాన్సాస్ సిటీ హోమ్ నుంచి కాల్ రావడంతో ఎమర్జెన్సీ బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఊయలలో పడుకోబెట్టిన పసికందు చలనం లేకుండా ఉంది. పాప శరీరంపై బట్టలు నల్లగా మాడిపోయి, డైపర్ కాలిపోయి కనిపించింది. శరీరం మొత్తం కాలిన గాయాలు ఉన్నాయి. ఆ పాపను పరీక్షించిన వైద్య బృందం.. అప్పటికే చనిపోయిందని తేల్చింది. ఏం జరిగిందని ఆ పాప తల్లి మరియా థామస్ (26) ను ప్రశ్నించగా.. పాపకు పాలు పట్టి నిద్రపుచ్చానని, అయితే, ఊయలలో బదులు పొరపాటున ఓవెన్ లో పడుకోబెట్టానని చెప్పింది. ఇంట్లో సోదా చేయగా.. కాలిన దుప్పటి ఒకటి పెరట్లో కనిపించిందని పోలీసులు తెలిపారు. కాగా, మరియా మానసిక స్థితిపైనా ఆమె స్నేహితురాలు సందేహం వ్యక్తం చేసింది. మానసిక అనారోగ్యం వల్లే మరియా ఇలా చేసి ఉండొచ్చని పేర్కొంది.

Baby In Oven, Crib Kansas, Mother, America, Infant dead

Comments (0)
Add Comment