Gyanvapi mosque: జ్ఞానవాపి మసీదు కింద ఆలయం.. పురావస్తు శాఖ సర్వేలో వెలుగులోకి వచ్చిన సంచలనాలు

  • మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలు, రాళ్లు వాడారని పేర్కొన్న ఏఎస్ఐ సర్వే
  • 34 శిలాశాసనాలు గుర్తించినట్టు వెల్లడి
  • శిల్పరీతి ఆధారాలు ఆలయం ఉన్నట్టుగా రుజువు చేస్తున్నాయని ప్రస్తావన
  • కోర్టు ఆదేశం మేరకు ఇరుపక్షాల కక్షిదారులకు సర్వే రిపోర్టు
  • మీడియాకు వెల్లడించిన హిందూ పిటిషనర్ తరపు న్యాయవాది

వారణాసీలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) అధికారులు నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గతంలో ఉన్న భారీ హిందూ దేవాలయాన్ని కూల్చి వేసి మసీదు నిర్మించారని ఏఎస్‌ఐ సర్వేలో తేల్చినట్టు వెల్లడైంది. సర్వే రిపోర్టును గురువారం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి కేసులోని ఇరుపక్షాలకు చెందిన 11 మంది కక్షిదారులకు అందజేశారు. హిందూ పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది విష్ణుశంకర్‌జైన్‌ ఈ రిపోర్టును బహిర్గతం చేశారు. మీడియా సమావేశంలో రిపోర్టులోని వివరాలను వెల్లడించారు. మసీదు స్థానంలో గతంలో ఆలయం ఉండేదని సర్వేలో వెల్లడైందని అన్నారు. మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను, రాళ్లను వినియోగించినట్టు తేలిందన్నారు. మొత్తంగా శిల్పరీతిని బట్టి ఆలయం ఉన్నట్టుగా రుజువవుతోందని ఏఎస్‌ఐ రిపోర్ట్ పేర్కొందని చెప్పారు.

839 పేజీలో ఏఎస్ఐ రిపోర్ట్..
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జరిపిన సర్వేకు సంబంధించి మొత్తం 839 పేజీలతో ఏఎస్ఐ రిపోర్టు తయారు చేసింది. ఇందులో సంచలన విషయాలను పేర్కొంది. ఆలయం గోడలతో పాటు కొన్ని ఇతర నిర్మాణాలను మసీదు నిర్మాణంలో కలిపారని చెప్పింది. మసీదు గోడలపై నాటి ఆలయ నిర్మాణం ఆనవాళ్లు ఉన్నాయని సర్వే తెలిపింది గోడలపై 34 శాసనాలు ఉన్నాయని, ఇవి దేవనగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపులలో ఉన్నాయని వివరించింది. ఈ శాసనాల మీద జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే దేవుళ్ల పేర్లు ఉన్నాయని సర్వే పేర్కొందని హిందూ పిటిషనర్ల తరపు న్యాయవాది విష్ణుశంకర్‌ జైన్‌ వెల్లడించారు. మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను ఉపయోగించారని తేలిందన్నారు. ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను మసీదు నిర్మాణంలో యథాతథంగా అదేవిధంగా ఉంచారని వివరించారు. దేవతల విగ్రహాలు, శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయని మరికొన్ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

కాగా వారణాసిలో విశ్వనాథుడి ఆలయం పక్కనున్న మసీదు కింద హిందూ ఆలయం ఉందని హిందూ కక్షిదారులు జిల్లా కోర్టులో పిటిషన్‌ వేశారు. చాలా కాలం నుంచి నడుస్తున్న ఈ వివాదానికి సంబంధించి ఏఎస్‌ఐ సర్వేకి గత ఏడాది జూలై 21న కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సర్వే అనంతరం డిసెంబరు 18న రిపోర్టు కోర్టుకు అందింది. సర్వే నివేదిక తమకు అందజేయాలంటూ ఇరు పక్షాలు కోర్టును కోరాయి. దీంతో రిపోర్టును అందజేశారు.

Gyanvapi mosque, Gyanvapi Case, ASI, Archaeological Survey of India

Leave A Reply

Your email address will not be published.