Rahul Gandhi: కేజ్రీవాల్ నివాసానికి వెళ్లనున్న రాహుల్ గాంధీ

  • సీఎం అరెస్ట్ నేపథ్యంలో కుటుంబానికి కాంగ్రెస్ అగ్రనేత ఓదార్పు
  • న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చిన రాహుల్ గాంధీ
  • కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాట ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన నివాసానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చనున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్‌కు అండగా నిలుస్తుందని భరోసా ఇవ్వనున్నట్టు పేర్కొన్నాయి. ఈ రోజు (శుక్రవారం) కేజ్రీవాల్‌ను లేదా ఆయన కుటుంబాన్ని కలవడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తారని, తదుపరి చట్టపరమైన సహాయానికి సిద్ధంగా ఉంటామని హామీ ఇవ్వనున్నారని వివరించాయి.

కాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. దేశంలో అసమ్మతిని అణచివేయడానికి, ప్రజాస్వామ్యాన్ని అంతమొందించేందుకు నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నారని ప్రధాని మోదీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘భయపడుతున్న నియంత ప్రజాస్వామ్యాన్ని చంపేయాలనుకుంటున్నాడు’’ అంటూ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా గురువారం రాత్రి ఆయన స్పందించారు. ‘‘మీడియా సహా అన్ని సంస్థలను స్వాధీనం చేసుకోవడం, పార్టీలను విచ్ఛిన్నం చేయడం, కంపెనీల నుంచి డబ్బు వసూలు చేయడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసినా ‘పైశాచిక శక్తి’కి సరిపోవడం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం కూడా ఒక సాధారణ విషయమైంది’’ అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

Rahul Gandhi, Aravind Kejriwal, Aravind Kejriwal Arrest, Congress AAP Delhi Liquor Scam Enforcement Directorate

Leave A Reply

Your email address will not be published.